Madvi Hidma

Madvi Hidma: హిడ్మా మృతి వెనుక భారీ కుట్ర? మావోయిస్టుల సంచలన లేఖ.. ఆ కాంగ్రెస్ నేతే టార్గెట్!

Madvi Hidma: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్ ఉదంతం ఇప్పుడు పెను సంచలనానికి దారితీసింది. మావోయిస్టు పార్టీ మాస్టర్‌మైండ్‌గా, పీపుల్స్ గెరిల్లా సుప్రీం లీడర్‌గా గుర్తింపు పొందిన హిడ్మా మృతిపై అల్లూరి సీతారామరాజు (ASR) డివిజన్ కమిటీ విడుదల చేసిన లేఖ రాజకీయ, పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఒక రాజకీయ నాయకుడి మోసం వల్లే తమ నేత బలయ్యాడని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.

నమ్మించి గొంతు కోశారా?

హిడ్మా మరియు అతని భార్య రాజేలను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తానని నమ్మబలికిన ఓ కాంట్రాక్టర్ కమ్ కాంగ్రెస్ నేత, పోలీసులకు సమాచారం అందించి ద్రోహానికి పాల్పడ్డారని మావోయిస్టు అధికార ప్రతినిధి విప్లవ్ ఆ లేఖలో పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన సదరు నేత వ్యూహాత్మకంగా వ్యవహరించి హిడ్మాను పోలీసుల చేతికి చిక్కేలా చేశారని పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనారోగ్యంతో ఉన్న నాయకుడిని కాపాడతానని చెప్పి మృత్యువు వైపు నడిపించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Jaishankar: ప్రమాదంలో భారత్‌.. బలూచ్ నేత సంచలన లేఖ!

మారెడుమిల్లి అడవుల్లో ముగిసిన ప్రస్థానం

దాదాపు రెండు దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన హిడ్మా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని మారెడుమిల్లి మండలం టైగర్ జోన్ ప్రాంతంలో ముగిసింది. నల్లూరు జలపాతం వద్ద పోలీసులు జరిపిన మెరుపు దాడిలో హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే (డీవీసీఎం), మరో నలుగురు కీలక సభ్యులు మృతి చెందారు. అనేక కోవర్టు ఆపరేషన్లు విఫలమైన తర్వాత, పక్కా సమాచారంతో పోలీసులు ఈ ఆపరేషన్ సక్సెస్ చేశారు. అయితే, ఈ సమాచారం వెనుక ఉన్న “హ్యాండ్” ఎవరిదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఖబడ్దార్.. ప్రజా కోర్టులో శిక్ష తప్పదు!

అడవుల్లోని సహజ సంపదను, ఖనిజాలను దోచుకోవడానికి ఆదివాసీలను ఎన్‌కౌంటర్ల పేరుతో హతమారుస్తున్నారని మావోయిస్టులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా హిడ్మా మృతికి కారణమైన వారిని గుర్తించామని, వారిని ప్రజా కోర్టులో శిక్షిస్తామని లేఖలో స్పష్టం చేశారు. “రాజకీయ నాయకులు ఖబడ్దార్” అంటూ హెచ్చరించడం ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోని నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *