Trivikram: వెంకటేశ్ – ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నువ్వు నాకు నచ్చావ్’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 1వ తేదీన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో, ఈ సినిమాకు సంబంధించిన జ్ఞాపకాలను నిర్మాత స్రవంతి రవికిశోర్‌తో కలిసి దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచుకున్నారు.
విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు కథ, మాటలు త్రివిక్రమ్ అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. 2001 సెప్టెంబర్ 6న విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్’ అప్పట్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించి, ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ,
“సిరివెన్నెల గారు పాటలు రాస్తున్నప్పుడు నేను దగ్గరగా ఉండే అవకాశం వచ్చింది. డబ్బుల కోసం కాకుండా, కథకు అవసరమైతేనే ఆయన పాటలు రాసేవారు. ఏ సందర్భంలో పాట సరిపోదని అనిపిస్తే, అది వెంటనే చెప్పేవారు. కథను పాటలో అందంగా చెప్పగలగడం ఆయన గొప్పతనం” అని సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు.
అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను కూడా ఆయన పంచుకున్నారు.
“రామానాయుడిగారి ఫ్యామిలీ కోసం ఒక ప్రివ్యూ షో వేశాం. సినిమా చూసిన తర్వాత వెంకటేశ్ గారి శ్రీమతి ఒక మాట అన్నారు. ‘మనకు ఎప్పుడు మనసు బాగోలేకపోయినా గుండమ్మ కథ చూసినట్టే, రాబోయే తరాల వాళ్లు కూడా ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు’ అని చెప్పారు. ఇప్పుడు అందరూ అదే మాట అనుకుంటుంటే, ఆ రోజున ఆమె చెప్పిన మాటే గుర్తుకు వస్తోంది” అని త్రివిక్రమ్ భావోద్వేగంగా తెలిపారు.
తరం మారినా, కాలం గడిచినా ప్రేక్షకులను అలరించే శక్తి ఉన్న సినిమాగా ‘నువ్వు నాకు నచ్చావ్’ నిలిచిందని, రీ రిలీజ్ సందర్భంగా మరోసారి అది రుజువుకాబోతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
