Delhi: నూతన సంవత్సర వేడుకల వేళ ఫుడ్ డెలివరీ సేవలకు ఆటంకం కలగకుండా స్విగ్గీ, జొమాటో సంస్థలు తమ డెలివరీ పార్ట్నర్లకు భారీ ఇన్సెంటివ్స్ ప్రకటించాయి. వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్ల యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
డిసెంబర్ 31న ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో జొమాటో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉండే పీక్ అవర్స్‌లో ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు చెల్లించనున్నట్లు తెలిపింది. ఆర్డర్ల లభ్యతను బట్టి ఒక్క రోజులోనే డెలివరీ పార్ట్నర్లు రూ.3,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఆర్డర్లను రద్దు చేసినా లేదా తిరస్కరించినా విధించే పెనాల్టీలను తాత్కాలికంగా ఎత్తివేసింది.
మరోవైపు స్విగ్గీ కూడా డెలివరీ వర్కర్లకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఈరోజు, రేపు రెండు రోజుల్లో కలిపి డెలివరీ పార్ట్నర్లు రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా డిసెంబర్ 31 రాత్రి పీక్ అవర్స్‌లో రూ.2,000 వరకు అదనపు చెల్లింపులు అందించనుంది. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో కూడా తన డెలివరీ సిబ్బందికి ఇన్సెంటివ్స్ పెంచినట్లు సమాచారం.
ఈనెల 25న క్రిస్మస్ రోజున యూనియన్లు చేపట్టిన సమ్మె కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని యూనియన్లు పిలుపునిచ్చిన నేపథ్యంలోనే కంపెనీలు ఈ ఆఫర్లను ప్రకటించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్–2020 ప్రకారం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అగ్రిగేటర్ కంపెనీలు తమ వార్షిక టర్నోవర్‌లో 1 నుంచి 2 శాతం వరకు సోషల్ సెక్యూరిటీ ఫండ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. ఈ పరిణామాల మధ్య ఇటీవల స్టాక్ మార్కెట్లో స్విగ్గీ, జొమాటో మాతృసంస్థల షేర్లు స్వల్పంగా నష్టపోయినట్లు సమాచారం.
