Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఎక్కడున్నా వదలం.. మాస్ వార్నింగ్

Amit Shah: భారతదేశంలో ఎక్కడ ఉన్నా బంగ్లాదేశ్ నుంచి చొరబడిన వారిని వెనక్కి పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు దాటి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు స్థానికుల సంస్కృతి, భద్రత, గుర్తింపులకు ముప్పుగా మారుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ చొరబాటుదారులు స్థానిక ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయితే కాంగ్రెస్ పార్టీ వారిని ఓటు బ్యాంకుగా చూస్తోందని అమిత్ షా ఆరోపించారు. ఆ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

అసోంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి గణనీయమైన అభివృద్ధి చేయలేదని అమిత్ షా దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల సాంస్కృతిక గుర్తింపును కాపాడటంతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని తెలిపారు.

బంగ్లాదేశ్ చొరబాటుదారులు అక్రమంగా ఆక్రమించిన లక్షకు పైగా బిఘాల భూమిని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అసోం ప్రభుత్వం విడిపించిందని అమిత్ షా ప్రశంసించారు. రాష్ట్రంలో పాతుకుపోయిన అక్రమ చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించేందుకు బీజేపీకి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

గత 11 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మిలిటెంట్ సంస్థలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని అసోంలో శాంతి భద్రతలను బలోపేతం చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. దేశ భద్రత, సరిహద్దుల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *