World Rapid ChampionShip: ప్రపంచ చెస్ రంగంలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. తాజాగా జరిగిన ‘ఫిడే వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్’లో ఓపెన్ కేటగిరీలో ఆయన విజేతగా నిలిచి, ఆరోసారి ప్రపంచ రాపిడ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. మరోవైపు భారత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి తృటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుని కాంస్యంతో సరిపెట్టుకున్నారు.
రాపిడ్ చెస్‌లో తిరుగులేని శక్తిగా ఎదిగిన మాగ్నస్ కార్ల్సన్, 2014, 2015, 2019, 2022, 2023 తర్వాత ఇప్పుడు 2025లోనూ టైటిల్ గెలిచి తన రికార్డును సుస్థిరం చేసుకున్నారు. మొత్తం 13 రౌండ్లలో కార్ల్సన్ 10.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఏడో రౌండ్లో వ్లాడిస్లావ్ ఆర్టెమివ్ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ, చివరి రోజు వరుసగా మూడు విజయాలు సాధించి టైటిల్ రేసులోకి దూసుకొచ్చారు. ఈ విజయంతో ఆయనకు 70,000 యూరోల (సుమారు ₹64 లక్షలు) బహుమతి లభించింది.
ఇది కూడా చదవండి: Pralay: రణ్వీర్ ‘ప్రలే’లో అలియా భట్ హీరోయిన్గా ఫిక్స్!
భారత యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించారు. చివరి రౌండ్లో అలెగ్జాండర్ షిమనోవ్ను ఓడించిన అర్జున్, మొత్తం 9.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. టై-బ్రేక్ పద్ధతిలో హన్స్ నీమాన్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి మెడల్ అందుకున్నారు. ఇతర భారత ఆటగాళ్ళలో నిహాల్ సరిన్ (19వ స్థానం), డి. గుకేష్ (20వ స్థానం), ఆర్. ప్రజ్ఞానంద (27వ స్థానం) తలో 8.5 పాయింట్లతో పటిష్టమైన పోటీని ఇచ్చారు.
మహిళల విభాగంలో భారత స్టార్ ప్లేయర్ కోనేరు హంపికి నిరాశే ఎదురైంది. మూడోసారి ప్రపంచ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఆమెకు తృటిలో తప్పిపోయింది. చివరి రౌండ్లో తోటి భారత క్రీడాకారిణి సవితా శ్రీతో జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం హంపి అవకాశాలను దెబ్బతీసింది. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచి ఉంటే ఆమె నేరుగా ఛాంపియన్‌గా నిలిచేది. చివరికి హంపి, జూ జినెర్, గోర్యాచ్కినా ముగ్గురూ 8.5 పాయింట్లతో సమంగా నిలిచినప్పటికీ, టై-బ్రేక్ స్కోరు తక్కువగా ఉండటంతో హంపికి కాంస్య పతకం దక్కింది.
రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్కినా మహిళల రాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. టై-బ్రేక్ ప్లే-ఆఫ్‌లో చైనా క్రీడాకారిణి జూ జినెర్పై 1.5–0.5 తేడాతో విజయం సాధించి తొలిసారి ఈ ఘనత సాధించారు. భారత క్రీడాకారిణులలో సవితా శ్రీ (4వ స్థానం), ఆర్. వైశాలి (5వ స్థానం), దివ్య దేశ్‌ముఖ్ (8వ స్థానం) టాప్-10లో నిలిచి సత్తా చాటారు.
