The Ashes 2025-26

The Ashes 2025-26: ఇంగ్లాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ

The Ashes 2025-26: యాషెస్ సిరీస్ 2025–26లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో బౌలింగ్ చేస్తూ అట్కిన్సన్ తన ఎడమ హ్యామ్‌స్ట్రింగ్‌ను గాయపరచుకున్నాడు.

నాలుగో టెస్టులో స్కాట్ బోలాండ్ వికెట్ తీసిన కొద్దిసేపటికే, తన ఐదో ఓవర్ పూర్తి చేస్తుండగా అట్కిన్సన్ నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత నిర్వహించిన స్కానింగ్‌లో అతనికి తీవ్రమైన హ్యామ్‌స్ట్రింగ్ గాయమైనట్లు నిర్ధారణ అయింది. దీనితో జనవరి 4 నుంచి సిడ్నీలో ప్రారంభం కానున్న ఆఖరి టెస్టుకు అతను అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ధృవీకరించింది. అట్కిన్సన్ స్థానంలో కొత్త ఆటగాడిని ఎవరినీ జట్టులోకి తీసుకోవడం లేదని బోర్డు స్పష్టం చేసింది.

ఈ యాషెస్ సిరీస్‌లో గాయం కారణంగా తప్పుకున్న మూడో ఇంగ్లాండ్ బౌలర్ అట్కిన్సన్. అంతకుముందు పెర్త్ టెస్టులో మార్క్ వుడ్ మోకాలి గాయంతో తప్పుకోగా, జోఫ్రా ఆర్చర్ సైడ్ స్ట్రెయిన్ కారణంగా సిరీస్ నుంచి నిష్క్రమించాడు. అట్కిన్సన్ ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో 6 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో కూడా 73 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో మాథ్యూ పాట్స్ లేదా మాథ్యూ ఫిషర్‌లలో ఒకరికి సిడ్నీ టెస్టులో అవకాశం దక్కవచ్చు.

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు విజయం కోసం ఇంగ్లాండ్ ఏకంగా 5,468 రోజుల పాటు (సుమారు 15 ఏళ్లు) వేచి చూడాల్సి వచ్చింది. చివరికి మెల్‌బోర్న్ టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇప్పటికే సిరీస్‌ను 1-3తో కోల్పోయినప్పటికీ, ఆఖరి టెస్టులో కూడా గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని బెన్ స్టోక్స్ సేన భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *