Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వెళ్లుతున్న టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (18189) రైలులో అగ్నిప్రమాదం సంభవించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం జిల్లా దువ్వాడ మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ఎలమంచిలి సమీపంలో ప్రమాదానికి గురైంది.
రైలులోని ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న B1, M2 ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నర్సింగబల్లి ప్రాంతంలో బీ1 బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం. పొగను గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. అయినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే మంటలు తీవ్రరూపం దాల్చి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బోగీల్లో నుంచి దిగిపోయి స్టేషన్ వైపు పరుగులు తీశారు. ఈ ఘటనలో బీ1 బోగీలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ (70) సజీవదహనం అయినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Also Read: Tollywood: ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నిక
సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి. గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అయితే రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. రైల్వే ఉన్నతాధికారులు కూడా స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అత్యవసరంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ ప్రమాదంతో సుమారు రెండు వేల మంది ప్రయాణికులు చలి, పొగ మధ్య ఎలమంచిలి స్టేషన్‌లోనే పడిగాపులు కాశారు. రైలు అనకాపల్లికి నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా చేరుకుంది. అగ్నిప్రమాదం కారణంగా విశాఖ–విజయవాడ మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లలో కొన్ని రైళ్లను తాత్కాలికంగా ఆపేశారు.
కాలిపోయిన రెండు బోగీలను అర్ధరాత్రి 3.30 గంటల తర్వాత ట్రాక్‌పై నుంచి తొలగించారు. ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులను మిగతా కోచ్‌ల్లో సర్దుబాటు చేశారు. అలాగే కొంతమందిని మూడు ఆర్టీసీ బస్సుల ద్వారా సామర్లకోట స్టేషన్‌కు తరలించారు. అక్కడ రెండు కొత్త ఏసీ బోగీలను జత చేసి రైలును ఎర్నాకుళం వైపు పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అగ్నిమాపక శాఖ, రైల్వే అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకరి మృతి బాధాకరమని పేర్కొన్న మంత్రి, బాధితులకు మెరుగైన సహాయం అందించాలని సూచించారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
