Ktr: 5 లక్షల కోట్ల భూ కుంభకోణం

Ktr: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా కేటయించిన భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కర్ణాటకలోని అత్తిబెలెలో ఇన్ఫోసిస్‌కు చెందిన విలువైన భూమిని పురవంకర సంస్థకు అమ్మడంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ప్రస్తావించారు. రాయితీలపై పొందిన భూమిని నిర్దిష్ట ప్రయోజనానికి ఉపయోగించనప్పుడు, దానిని వాణిజ్య ధరకు అమ్ముకునే హక్కు లేదని కార్తీ చిదంబరం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “తెలంగాణలోనూ ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాల కల్పన వంటి ప్రజాప్రయోజనాల కోసం రాయితీలతో ఇచ్చిన భూములను అమ్మి, కొందరు బంధువులకు లబ్ధి చేకూర్చే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు” అని అన్నారు.

అలాంటి భూములను ప్రభుత్వానికి తిరిగి అప్పగించి, ప్రజల అవసరాల కోసం వినియోగించాలని కేటీఆర్ సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, పేదల ఇళ్ల నిర్మాణం, పార్కులు, బస్‌స్టాండ్లు, పార్కింగ్ వంటి ప్రజాసౌకర్యాల కోసం ఈ స్థలాలు ఉపయోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూ కుంభకోణానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్‌లో గజం లక్ష రూపాయల విలువైన భూమిని కేవలం రూ.4,000కే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వం ఇస్తున్న ఈ ‘సేల్ ఆఫర్’ చూసి రియల్ ఎస్టేట్ డెవలపర్లు మోసపోవద్దని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఈ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *