Ashes 2025-26: మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా జరిగిన 2025-26 యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పర్యాటక ఇంగ్లండ్ జట్టు చేతిలో ఆసీస్ 4 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించడం ఆతిథ్య జట్టుకు దాదాపు 15 ఏళ్లుగా అలవాటుగా మారింది. అయితే ఈ విజయంతో ఇంగ్లండ్ ఆధిపత్యానికి తెరపడింది. చివరిసారిగా జనవరి 2011లో సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ (ఆండ్రూ స్ట్రాస్ కెప్టెన్సీలో) ఆసీస్‌ను ఓడించింది. ఆ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఆడిన 18 టెస్టుల్లో ఆస్ట్రేలియా 16 విజయాలు, 2 డ్రాలు సాధించి అజేయంగా నిలిచింది. తాజా ఓటమితో ఆ విజయ పరంపర ముగిసింది.
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో మెల్బోర్న్ (MCG) వేదికగా కేవలం రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం ఇది రెండోసారి మాత్రమే. 1931 ఫిబ్రవరి 13-14 తేదీల్లో ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ తొలిసారి రెండు రోజుల్లో ముగిసింది. దాదాపు 94 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అలాంటి దృశ్యం పునరావృతమైంది. ఆస్ట్రేలియా చరిత్రలో ఇప్పటివరకు జరిగిన 450కి పైగా టెస్టుల్లో, కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే రెండు రోజుల్లో ముగిశాయి. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లోనే ఇలా రెండు మ్యాచ్‌లు (బ్రిస్బేన్ మరియు మెల్బోర్న్) రెండు రోజుల్లోనే ముగియడం గమనార్హం.
Also Read: Harry Brook: హ్యారీ బ్రూక్ సరికొత్త ప్రపంచ రికార్డు
MCG చరిత్రలో ఆస్ట్రేలియా ప్రస్థానం
మెల్బోర్న్ స్టేడియం ఆస్ట్రేలియాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన వేదిక. 1877లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇక్కడే ప్రారంభమైంది.
మొత్తం మ్యాచ్‌లు: 118 టెస్టులు.
ఆసీస్ విజయాలు: 68
ఆసీస్ ఓటములు: 33 (ఇందులో 21 ఓటములు ఇంగ్లండ్ చేతిలోనే కావడం విశేషం).
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం కావడం జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. యాషెస్ చరిత్రలో కేవలం రెండు రోజుల్లో ముగిసిన 7వ మ్యాచ్‌గా ఇది రికార్డులకు ఎక్కింది.
