Harry Brook: మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఇంగ్లండ్ యువ సంచలనం, వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్ తొలి రోజున బ్రూక్ టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 3000 పరుగులు (ఎదుర్కొన్న బంతుల పరంగా) పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌కు ముందు 3000 పరుగుల మైలురాయిని చేరడానికి బ్రూక్ కేవలం 7 పరుగుల దూరంలో ఉన్నారు. శుక్రవారం నాటి ఆటలో 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడే క్రమంలో ఆయన ఈ ఘనత సాధించారు. హ్యారీ బ్రూక్ 3000 పరుగుల కోసం కేవలం 3468 బంతులు మాత్రమే తీసుకున్నారు.
Also Read: Navjot Singh Sidhu: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం గిల్‌క్రిస్ట్ (3610 బంతులు) పేరిట ఉండేది. బ్రూక్ సహచర ఆటగాడు బెన్ డకెట్ కూడా ఇదే మ్యాచ్‌లో (శనివారం) 3474 బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేసి ఈ జాబితాలో రెండో స్థానానికి చేరారు. కేవలం ఎదుర్కొన్న బంతుల పరంగానే కాకుండా, ఆడిన ఇన్నింగ్స్‌ల పరంగా కూడా బ్రూక్ రికార్డు సృష్టించారు. బ్రూక్ తన 57వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు. తద్వారా 1949లో ఇదే ఘనత సాధించిన ఇంగ్లండ్ దిగ్గజం డెనిస్ కాంప్టన్ రికార్డును సమం చేశారు. ఇంగ్లండ్ తరపున అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరిన రెండో ఆటగాడిగా నిలిచారు (హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 51 ఇన్నింగ్స్‌లతో మొదటి స్థానంలో ఉన్నారు). అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మాన్ (33 ఇన్నింగ్స్‌లు) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
