Mumbai: మాతృ భాషలో మాట్లాడలేదన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తల్లి…

Mumbai: మహారాష్ట్రలోని నవీ ముంబైలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠీ భాష సరిగా మాట్లాడటం లేదన్న కారణంతో ఆరేళ్ల వయసున్న తన కన్న కూతురినే ఓ తల్లి గొంతు నులిమి హత్య చేసిన ఘటన కలాంబోలి ప్రాంతంలో చోటుచేసుకుంది.

ప్రారంభంలో చిన్నారి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ, పోలీసులకు అనుమానం రావడంతో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో శ్వాస ఆడకపోవడం వల్లే చిన్నారి మృతి చెందినట్లు తేలడంతో అసలు నిజం బయటపడింది.

పోలీసుల వివరాల ప్రకారం, కలాంబోలిలోని గురుసంకల్ప్ హౌసింగ్ సొసైటీలో నివసించే దంపతులకు 2019లో ఈ చిన్నారి జన్మించింది. భర్త ఐటీ ఇంజనీర్ కాగా, తల్లి బీఎస్సీ చదివినట్లు పోలీసులు తెలిపారు. చిన్నప్పటి నుంచి పాపకు మాటలు సరిగా రాకపోవడంతో పాటు ఎక్కువగా హిందీ మాట్లాడేది. ఈ విషయంపై తల్లి తరచూ అసహనం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి కూతురు నాకు వద్దు” అంటూ భర్తతో గొడవ పడినట్లు విచారణలో వెల్లడైంది.

డిసెంబర్ 23 రాత్రి చిన్నారిని తల్లి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు గుర్తించారు. పాప స్పృహ కోల్పోయిన తర్వాత ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కలాంబోలి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కోటే పోస్టుమార్టానికి ఆదేశించారు

దీంతో పోలీసులు తల్లిదండ్రులను సుమారు ఆరు గంటల పాటు విచారించగా, తానే కూతురిని హత్య చేసినట్లు తల్లి అంగీకరించినట్లు తెలిపారు. నిందితురాలు కొంతకాలంగా మానసిక చికిత్స తీసుకుంటున్నట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ఆమెను అరెస్టు చేసి, ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *