Bandi Sanjay

Bandi sanjay: డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల పేర్లు.. 2017 ఆధారాలు ఏమయ్యాయి?

Bandi sanjay: డ్రగ్స్ కేసుల విచారణపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. పండుగలు, నూతన సంవత్సరం సమయాల్లో మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అసలు డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ఆయన నిలదీశారు.

2017లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో సినిమా ప్రముఖులు, పలువురు ప్రముఖుల పేర్లు వినిపించాయని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆ సమయంలో విచారణ జరిపితే కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా బయటపడే అవకాశముందని అన్నారు. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే వాస్తవాలు బయటకు రాకుండా అప్పటి సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా విచారణ అధికారి అకున్ సబర్వాల్‌ను బదిలీ చేసి కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఆ ఆధారాలన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. వాటిని కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు.

డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో స్టేట్‌మెంట్ రికార్డులను అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని, ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే డ్రగ్స్ కేసు వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలు వచ్చినప్పుడే డ్రగ్స్ గుర్తుకు తెచ్చుకుంటోందని ఎద్దేవా చేశారు. ఇదే జీరో డ్రగ్స్ విధానమా? అని ప్రశ్నించారు. కొంతమంది అధికారులు లంచాలకు లొంగి డ్రగ్స్ మాఫియాతో రాజీపడుతున్నారనే విశ్వసనీయ సమాచారం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.

డ్రగ్స్‌ను నిజంగా నిర్మూలించాలంటే అకున్ సబర్వాల్ లాంటి సమర్థులైన అధికారులకు విచారణ అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల డ్రగ్స్ నిర్మూలన జరగదని, పారదర్శకంగా, వేగవంతమైన దర్యాప్తు జరగాల్సిందేనని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *