Vangalapudi Anitha: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయాల పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన జగన్ పుట్టినరోజు వేడుకల తీరు ఆమె తప్పుబట్టారు. బహిరంగ ప్రదేశాల్లో జంతుబలులు ఇచ్చి, ఆ రక్తాన్ని ఫ్లెక్సీలపై చల్లడం ఏ రకమైన సంస్కృతి అని ఆమె నిలదీశారు. పుట్టినరోజు వేడుకలను ఫ్యాక్షన్ సినిమాలను తలపించేలా నిర్వహించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Rajanna Sircilla: వేములవాడలో అక్రమ దర్శనాల దందా.. ఏడుగురిపై కేసు నమోదు!
వేట కొడవళ్లతో కేకులు కట్ చేయడం, హింసను ప్రోత్సహించేలా వ్యవహరించడం ద్వారా యువతను, చిన్న పిల్లలను సైకోలుగా మారుస్తున్నారని ఆమె ఆరోపించారు. “నరుకుతాం, చంపుతాం” అనే నినాదాలు చేయిస్తూ టీనేజ్ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం తన పార్టీ నేతలు చేసే తప్పులను జగన్ ఖండించకపోవడం దారుణమన్నారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లెలిపైనే కేసులు పెట్టిన వ్యక్తి, సామాన్యుల పిల్లలను రక్షిస్తాడని అనుకోవడం భ్రమ అని ఆమె విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ ఎంతకైనా దిగజారుతోందని, ఇలాంటి అరాచకాలను సహించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు.
