Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో కొందరు వ్యక్తులు భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ‘బ్రేక్ దర్శనం’ చేయిస్తామంటూ నమ్మించి, వారి వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. భీమేశ్వర ఆలయ పరిసరాల్లో ఈ అక్రమ వసూళ్లు జరుగుతుండగా, అప్రమత్తమైన ఆలయ భద్రతా సిబ్బంది నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై ఆలయ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. భక్తులను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్న ఏడుగురు వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. సాధారణంగా పండగలు, సెలవు దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని గమనించి, క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పనిలేకుండా త్వరగా దర్శనం చేయిస్తామని ఈ ముఠా భక్తులను ప్రలోభపెడుతున్నట్లు విచారణలో తేలింది. ఇలాంటి అక్రమ పద్ధతుల ద్వారా సామాన్య భక్తులకు ఇబ్బంది కలగడమే కాకుండా, ఆలయ నిబంధనలకు విఘాతం కలుగుతోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు మరియు పోలీసులు భక్తులకు కీలక విన్నపం చేశారు. ఆలయ ప్రాంగణంలో లేదా బయట ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నా, త్వరగా దర్శనం చేయిస్తామని డబ్బులు అడిగినా వారి మాటలు నమ్మవద్దని సూచించారు. దర్శనం కోరుకునే వారు కేవలం దేవస్థానం ఏర్పాటు చేసిన అధికారిక కౌంటర్లలో మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, భవిష్యత్తులో కూడా నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
