Hyderabad: తెలంగాణలో మహిళలకు ‘కామన్ మొబిలిటీ కార్డు’.

Hyderabad: తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న మహిళల కోసం ప్రత్యేకంగా **‘కామన్ మొబిలిటీ కార్డు’ (CMC)**లను ప్రవేశపెట్టనుంది. ఈ కార్డుల ద్వారా ఇకపై ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఆధార్ ఆధారంగా ఉచిత ప్యాణం చేస్తున్న సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఈ స్మార్ట్ కార్డుల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ కార్డుల రూపకల్పన కోసం ఇప్పటికే **సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)**తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

గతేడాది ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి రూ. 8,500 కోట్లు చెల్లించింది. అయితే ఆధార్ కార్డులో ఫోటోలు స్పష్టంగా లేకపోవడం, నకిలీ కార్డుల వినియోగం వంటి కారణాలతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను నివారించేందుకే కొత్త స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఈ కామన్ మొబిలిటీ కార్డు కేవలం బస్ పాస్‌కే పరిమితం కాకుండా బహుళ ప్రయోజనకారిగా ఉండనుంది. మహిళలు బస్సుల్లో ఈ కార్డును ట్యాప్ చేసి ఉచితంగా ప్రయాణించవచ్చు. అలాగే కార్డులో డబ్బులు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర రవాణా సేవలను కూడా వినియోగించుకోవచ్చు.

ఈ కార్డుల ద్వారా ప్రయాణికుల డేటా ప్రభుత్వానికి కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఏ మార్గాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కలుగుతుంది. దీని వల్ల ఆర్టీసీ నష్టాలు తగ్గడమే కాకుండా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో రేషన్, ఆరోగ్య సేవలు సహా ఇతర ప్రభుత్వ పథకాలను కూడా ఈ కార్డుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదట మహిళలతో ప్రారంభించి, దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *