Jc Prabhakar reddy: న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తాం

Jc Prabhakar reddy: తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సన్నాహాలు ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకలకు సినీ నటి మాధవీలతను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

అనంతపురం కలెక్టరేట్ సమీపంలో మీడియాతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి, పెన్నానది ఒడ్డున ఉన్న పార్కును న్యూఇయర్ వేడుకల వేదికగా ఎంపిక చేసినట్లు చెప్పారు. గతేడాది ఇదే పార్కులో జరిగిన న్యూఇయర్ వేడుకలపై మాధవీలత చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ అంశంలో ఇరువర్గాల మధ్య ప్రస్తుతం రాజీ కుదిరిందని, అందుకే ఈసారి ఆమెను ఆహ్వానించాలని నిర్ణయించామని తెలిపారు. అయితే వేడుకలకు హాజరు కావాలా వద్దా అనేది పూర్తిగా మాధవీలత ఇష్టమేనని స్పష్టం చేశారు.

న్యూఇయర్ వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఆస్వాదించేలా ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించినట్లు జేసీ తెలిపారు.

డిసెంబర్ 29న చిన్నపిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, కుటుంబ సమేతంగా పాల్గొనవచ్చని చెప్పారు.

డిసెంబర్ 30న యువతను ఆకట్టుకునే వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

డిసెంబర్ 31న పెద్దల కోసం ప్రత్యేక న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ఉంటాయని వెల్లడించారు.

29, 30 తేదీల్లో అన్ని వయసుల వారికి హాజరు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

వేడుకల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రజలు సహకరించి న్యూఇయర్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *