CP Sajjanar

CP Sajjanar: హైదరాబాద్‌లో తగ్గిన నేరాలు.. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన

CP Sajjanar: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడుతోందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, డ్రోన్ల వినియోగం మరియు ‘ఆపరేషన్ కవచ్’ వంటి కార్యక్రమాల వల్ల నేరగాళ్ల ఆటకట్టించగలిగామని ఆయన పేర్కొన్నారు.

తగ్గుముఖం పట్టిన ప్రధాన నేరాలు
గత ఏడాదితో పోలిస్తే ఈసారి నగరంలో మొత్తం నేరాలు 15 శాతం తగ్గాయి. ప్రజలను వేధిస్తున్న సైబర్ నేరాలు 8 శాతం, మహిళలపై జరిగే అఘాయిత్యాలు 6 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కిడ్నాప్ కేసులు సగానికి సగం తగ్గి 166కి చేరడం విశేషం. ఆస్తి తగాదాల విషయంలో కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఆ కేసులు 64 శాతం తగ్గాయని సీపీ వివరించారు. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేయడంలో కూడా పోలీస్ విభాగం ఈసారి మంచి ఫలితాలు సాధించింది.

డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యం
తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సజ్జనార్ తెలిపారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు వచ్చే ఏడాది నుంచి ప్రతి జోన్‌లో ప్రత్యేకంగా ‘నార్కోటిక్ టీమ్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నేరగాళ్లు తెలంగాణలో అడుగుపెట్టాలంటేనే భయపడేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

న్యూ ఇయర్ వేడుకలపై హెచ్చరిక
త్వరలో రాబోయే నూతన సంవత్సర వేడుకల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగంగా డ్రైవింగ్ చేయడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు అతిక్రమించవద్దని ఆయన కోరారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *