CWC Meeting

CWC Meeting: ఢిల్లీలో నేడు సీడబ్ల్యూసీ సమావేశం..!

CWC Meeting: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఇందిరాభవన్ వేదికగా నిర్వహించే ఈ కీలక భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి బయలుదేరగా, ఆదివారం తిరిగి హైదరాబాద్‌కు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర్ రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్ రెడ్డి పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ తీసుకోవాల్సిన వ్యూహంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ అనే కొత్త చట్టంలోని లోపాలపై సీడబ్ల్యూసీ దృష్టి సారించనుంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కూడా కార్యాచరణ ఖరారు చేసే అవకాశముందని సమాచారం.

Also Read: Bangladesh: బంగ్లాలో ఉద్రిక్తతలు.. రాక్‌స్టార్ కాన్సర్ట్‌పై మూక దాడి..!

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అగ్రనేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న క్యాబినెట్ విస్తరణ అంశానికి ఈ సమావేశాల తర్వాత స్పష్టత వచ్చే అవకాశముందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

అదేవిధంగా మంత్రివర్గంలో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో కులాలు, వర్గాల వారీగా మార్పులు చేయాలన్న ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతుందన్న సమాచారం. ప్రస్తుత క్యాబినెట్‌లో ఉన్న కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పెద్ద కోమటిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించి, ఆయన స్థానంలో చిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్న చర్చ నడుస్తోందని సమాచారం. అలాగే కొండా సురేఖ స్థానంలో విజయశాంతిని మంత్రివర్గంలోకి తీసుకురావాలన్న ప్రతిపాదన కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *