Hyderabad: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో నిర్మాతల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిర్మాత ప్రసన్న కుమార్ అన్నారు. పెద్ద నిర్మాతలు ఒకవైపు, చిన్న నిర్మాతలు మరోవైపు నిలబడి ఉన్న పరిస్థితి ఇండస్ట్రీకి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్న సినిమాలు తీసే నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా థియేటర్ల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. భారీ బడ్జెట్ సినిమాలకే ఎక్కువ థియేటర్లు కేటాయిస్తూ, చిన్న సినిమాలను పక్కన పెట్టడం వల్ల ప్రతిభ ఉన్న నిర్మాతలు, దర్శకులు నష్టపోతున్నారని చెప్పారు.
ఇండస్ట్రీ మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని విమర్శించారు. ఈ పరిస్థితి మారాలంటే చిన్న నిర్మాతలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. థియేటర్ల కేటాయింపుతో పాటు, బెనిఫిట్ షోలు కూడా చిన్న సినిమాలకు అనుమతించాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం మాటల ఉద్దేశం పరిశ్రమలో సమతుల్యత తీసుకురావడమేనని, కానీ కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు.
చిన్న నిర్మాతలు బతికేలా విధానాలు ఉండాలని, అప్పుడే ఇండస్ట్రీ మొత్తం ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్లు–చిన్నవాళ్లు అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ప్రసన్న కుమార్ పిలుపునిచ్చారు.
