Canada

Canada: కెనడాలో దారుణం.. భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు..!

Canada: కెనడాలోని టొరంటో నగరంలో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురైన ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన 20 ఏళ్ల శివాంక్ అవస్థి, దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన స్కార్‌బొరౌగ్‌ క్యాంపస్‌లో లైఫ్ సైన్సెస్ మూడో సంవత్సరం చదువుతున్న శివాంక్, స్థానిక హైల్యాండ్‌ క్రీక్‌ ట్రెయిల్‌ వద్ద ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో శివాంక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ దురదృష్టకర సంఘటనపై టొరంటోలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శివాంక్ మృతి తమను ఎంతగానో కలచివేసిందని, ఈ కష్టసమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంతో పాటు ఇతర చట్టపరమైన ప్రక్రియల కోసం స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. శివాంక్ మరణంతో టొరంటోలో ఈ ఏడాది జరిగిన మొత్తం హత్యల సంఖ్య 41కి చేరడం అక్కడ పెరుగుతున్న నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది.

Also Read: CM Chandrababu: తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన

ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ప్రవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే హిమాన్షీ ఖురానా అనే భారతీయ మహిళ దారుణ హత్యకు గురైన విషయం మరువక ముందే, మరో యువ విద్యార్థి బలవ్వడం గమనార్హం. ప్రస్తుతం శివాంక్ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని టొరంటో పోలీసులు వెల్లడించారు. ఈ వరుస హత్యలు విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *