Ayodhya

Ayodhya: అయోధ్యలో మరో అద్భుతం.. రూ. 30 కోట్ల విలువైన స్వర్ణ రామ విగ్రహం

Ayodhya: రామజన్మభూమి అయోధ్యలో ఆధ్యాత్మిక వైభవం మరో శిఖరాన్ని చేరుకోబోతోంది. ఇప్పటికే బాలరాముడి దర్శనంతో పులకించిపోతున్న భక్తులకు, త్వరలో మరో అద్భుత దృశ్యం సాక్షాత్కరించనుంది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు అత్యంత విలువైన, అరుదైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయానికి కానుకగా సమర్పించారు.

విగ్రహం విశేషాలు: కళాఖండం.. అపురూపం!

దక్షిణ భారత శిల్పకళా నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. దీని ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. 10 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పుతో గంభీరంగా ఉంటుంది. సుమారు 5 క్వింటాళ్లు (500 కేజీలు) బరువు ఉంటుంది. ఈ విగ్రహం కేవలం లోహంతో చేసినది కాదు.. బంగారం, వజ్రాలు, రత్నాలు, పచ్చలు, కెంపులతో అత్యంత కళాత్మకంగా పొదిగి రూపొందించారు. ఈ విగ్రహాని చేయడానికి  సుమారు రూ. 25 కోట్ల నుండి రూ. 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఉడిపి, తంజావూరుకు చెందిన సుప్రసిద్ధ కళాకారులు తమ హస్తకళతో ఈ విగ్రహానికి ప్రాణం పోశారు.

1750 కిలోమీటర్ల ప్రయాణం.. డిసెంబర్ 29న ప్రతిష్ఠ

కర్ణాటక నుంచి ప్రత్యేక వాహనంలో సుమారు 5-6 రోజుల పాటు 1750 కిలోమీటర్లు ప్రయాణించి ఈ విగ్రహం మంగళవారం అయోధ్యకు చేరుకుంది.రామాలయ సముదాయంలోని సంత్ తులసీదాస్ ఆలయం సమీపంలో ఉన్న ‘అంగద్ తిలా’ ప్రాంతంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు.డిసెంబర్ 29న ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఉడిపి స్వామీజీ వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి: Rushikonda Palace: ఏపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!.. టూరిజం హబ్‌గా రుషికొండ ప్యాలెస్‌?

రెండో వార్షికోత్సవ వేళ.. ఆధ్యాత్మిక సంబరం

రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 27, 2025 నుండి జనవరి 2, 2026 వరకు అయోధ్యలో భారీ వేడుకలు జరగనున్నాయి.

  • డిసెంబర్ 31: ప్రధాన మతపరమైన క్రతువులు నిర్వహిస్తారు.

  • సాంస్కృతిక వేడుకలు: డిసెంబర్ 29 నుంచి జనవరి 2 వరకు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలతో అయోధ్య సందడిగా మారనుంది.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ, ఈ అపురూప కానుకను పంపిన భక్తుడి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉందని, పోస్టల్ శాఖ ద్వారా ఇది వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ‘బంగారు రాముడి’ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండటంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *