Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన స్థాయికి చేరాలన్న లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం విధానాలు రూపొందించి అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. మౌలిక సదుపాయాల మెరుగుదల, నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
పాఠశాలలకు సంబంధించిన బిల్లులు ఏ పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉండకూడదని అధికారులను ఆయన కఠినంగా ఆదేశించారు. చిన్న నిర్లక్ష్యం కూడా విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. పనుల్లో తూతూ మంత్రంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని, బాధ్యతగా పని చేయని అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ప్రజల కోసం పని చేస్తున్నామనే స్పష్టమైన అవగాహనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలన్నారు. విద్య, ఆరోగ్యం వంటి ప్రాధమిక రంగాల్లో నిజమైన మార్పు తీసుకురావాలంటే అందరూ సీరియస్‌గా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
