Pawan Kalyan

Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పటంలో పర్యటన

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకుంటూ ఇప్పటం గ్రామంలో పర్యటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో ఇచ్చిన మాట తప్పడం సహజం అనుకునే రోజుల్లో, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక సామాన్య వృద్ధురాలికి ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నిలబెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామానికి బుధవారం చేరుకున్న ఆయన, ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో పలువురి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చినందుకే ప్రభుత్వం కక్షపూరితంగా ఈ చర్యకు పాల్పడిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ క్లిష్ట సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు. అప్పుడు ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆయనను ఆశీర్వదిస్తూ.. ఎన్నికల్లో గెలిచి పెద్ద పదవిలో ఉన్నప్పుడు మళ్లీ తమ ఇంటికి రావాలని కోరారు. ఆనాడు ఆమెకు ఇచ్చిన మాటను గుర్తుంచుకున్న పవన్, నేడు హోదా పెరిగినా తన మనసు మారలేదని నిరూపించారు.

Also Read: Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి.. డ్రగ్స్ దందాలో పడ్డ ప్రేమజంట!

నాగేశ్వరమ్మ ఇంటికి చేరుకున్న పవన్‌కు ఆమె ఆప్యాయంగా స్వాగతం పలికారు. పవన్ ఆమెను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేవలం పరామర్శతోనే సరిపెట్టకుండా, ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు పవన్ భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నాగేశ్వరమ్మకు రూ. 50 వేలు, ఆమె మనవడి ఉన్నత చదువుల కోసం రూ. 1 లక్ష తక్షణ సాయంగా అందించారు. అంతటితో ఆగకుండా, ఆ బాలుడి విద్యాభ్యాసం కోసం ప్రతి నెలా తన వ్యక్తిగత వేతనం నుంచి రూ. 5 వేలు అందజేస్తానని పవన్ నిర్ణయించుకోవడం ఆయనలోని దాతృత్వానికి నిదర్శనంగా నిలిచింది.

తన ఇంటికి వచ్చిన పవన్‌ను చూసి నాగేశ్వరమ్మ కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇచ్చిన మాట ప్రకారం మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది.. మా ఇంటి పెద్ద కుమారుడిలా వచ్చి పలకరించారు” అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పవన్ ఆమెకు సూచించగా, కుటుంబం మొత్తానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎలా చేరువగా ఉండాలో పవన్ తన ప్రవర్తన ద్వారా చాటిచెప్పారని స్థానికులు, జనసైనికులు కొనియాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *