Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వబోతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ (SIT) విచారణలు రాష్ట్రంలో ఒక డ్రామాలా మారిపోయాయని ఆయన విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, ఇలాంటి కేసులు తమకు కొత్తేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే, అంటే ఈ నెల 3వ తేదీ సాయంత్రం తనకు నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికో లేదా మంచి పోస్టింగులు దక్కించుకోవడానికో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Also Read: Telangana Cold Wave: తెలంగాణను వణికిస్తున్న చలి.. రాబోయే 3 రోజులు మరింత డేంజర్!
అధికారులు తమ పరిధి దాటి ప్రవర్తిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అతిగా వ్యవహరించిన అధికారుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అందరూ చూస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ నాయకుల మెప్పు కోసం నిబంధనలు ఉల్లంఘిస్తే, రేపు ప్రభుత్వం మారినప్పుడు అదే గతి పడుతుందని హరీశ్‌రావు అధికారులను హెచ్చరించారు.
రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని ఆయన ఆరోపించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
