GHMC: హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300కు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ వివాదానికి సంబంధించి పిటిషనర్ తరఫు లాయర్లు తమ వాదనలను వినిపించారు. వార్డుల విభజనకు సంబంధించి ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదని వారు ఆరోపించారు. అలాగే, కొత్త విభజనపై ప్రజలు తమ అభ్యంతరాలను తెలపడానికి తగినంత సమయం ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని వారు వాదించారు.
మరోవైపు ప్రభుత్వ తరఫు లాయర్లు ఈ వాదనలను తోసిపుచ్చారు. చట్టం ప్రకారమే డివిజన్ల విభజన నోటిఫికేషన్ ఇచ్చామని వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రజల నుంచి వచ్చిన సుమారు 3,100 అభ్యంతరాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు. రెండు వైపుల వాదనలు విన్న తర్వాత, పరిపాలనాపరమైన ఈ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని చెబుతూ హైకోర్టు కేసును ముగించింది.
