Sridharbabu: తెలంగాణ యువతకు శుభవార్త చెబుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి వస్తున్న కొత్త పెట్టుబడుల ద్వారా రాబోయే రోజుల్లో సుమారు 1.40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమిట్ ద్వారా సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదిరాయని, ఇవన్నీ కార్యరూపం దాల్చితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పరిశ్రమల స్థాపన విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలన్నీ క్షేత్రస్థాయికి రాలేదని, కానీ తాము వాటిని రాజకీయం చేయలేదని గుర్తుచేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకుని, రాష్ట్ర అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని కోరారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం ప్రతిపక్ష నాయకులకు ఇష్టం లేనట్లుగా వారి మాటలు ఉన్నాయని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
హైదరాబాద్ నగరం ప్రస్తుతం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని మంత్రి వివరించారు. కేవలం ఒక్క ఏడాది కాలంలోనే 75 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను తెలంగాణకు తీసుకువచ్చామని, ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. గతేడాది మొత్తం మీద రూ.3.40 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు కూడా హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ ఒక పారిశ్రామిక కేంద్రంగా ఎదిగిందని, ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఇక్కడ ఏర్పాటయ్యాయని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అవసరమయ్యే వ్యాక్సిన్లలో మూడొంతులు మన హైదరాబాద్ నుంచే ఎగుమతి కావడం గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని, ప్రతి ఒప్పందాన్ని క్షేత్రస్థాయిలో పరిశ్రమగా మార్చేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
