Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. గత ఆరు రోజులుగా భాగ్యనగరంలో బస చేసిన ఆమె, తన పర్యటనను ముగించుకుని సోమవారం ప్రత్యేక విమానంలో తిరిగి దిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో ఆమెకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ నెల 17న హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి, తన విడిది కాలంలో వరుస కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ముఖ్యంగా డిసెంబర్ 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) ఛైర్పర్సన్ల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. అనంతరం 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
పర్యటనలో భాగంగా ఆదివారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆరు రోజుల పాటు సాగిన ఈ పర్యటనతో రాష్ట్రపతి నిలయం సందడిగా మారింది. ప్రతీ ఏటా సంప్రదాయంగా వచ్చే ఈ శీతాకాల విడిది, ఈసారి కూడా ఎంతో క్రమశిక్షణతో, విజయవంతంగా ముగిసింది.
