Sai kumar: టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. యుగంధర్ మునీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మహీధర్ రెడ్డి, అన్నాభీమోజు నిర్మించగా, ఆది సరసన అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. భయంకరమైన సన్నివేశాలతో పాటు ఆసక్తికరమైన కథతో రూపొందినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ యువ హీరోలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో సీనియర్ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ హీరో కిరణ్ అబ్బవరంను ప్రశంసించారు. అయితే అదే సమయంలో స్టేజ్‌పై ఉన్న తన కుమారుడు ఆది సాయికుమార్ ఫోన్ చూస్తుండటాన్ని గమనించిన సాయికుమార్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు
“నేను మాట్లాడుతుంటే నువ్వు ఫోన్ చూడడం ఏంటి? ఫోన్ పక్కన పెట్టి ఇలా రా” అంటూ గట్టిగా మందలించడంతో, ఆది ఒక్కసారిగా అలెర్ట్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సాయికుమార్ తీరును సమర్థిస్తుండగా, మరికొందరు ఇది సరదాగా జరిగిన తండ్రి–కొడుకు సంఘటనగా భావిస్తున్నారు. ఏదేమైనా, ఈ వైరల్ వీడియో ‘శంబాల’ సినిమాకు అదనపు పబ్లిసిటీగా మారిందని సినీ వర్గాలు అంటున్నాయి.
