Harish Rao

Harish Rao: తొక్కుకుంటూ ఎదిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారు

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ గురువు అని తాము అంటే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తారని, కానీ ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిసిన సందర్భంలో చంద్రబాబే స్వయంగా తన గురువు అని అంగీకరించారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

ఒకసారి చంద్రబాబును దేవతలా పొగడ్తలతో ముంచెత్తుతారు, మరోసారి బలిదేవతలా చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడిందని, దేశానికే తలమానికంగా నిలిచిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర జీఎస్‌డీపీ మూడు రెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని తెలిపారు. అయితే రెండేళ్లుగా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికీ సరైన సిద్ధత లేకుండా సభకు వస్తున్నారని విమర్శించారు. సగం సగం ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని అన్నారు.

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్‌చాట్ పెట్టారని, దీనివల్ల ఆయన మనస్తత్వం స్పష్టంగా బయటపడిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దని హితవు పలికారు.

సొంత పార్టీ నాయకులనే తొక్కుకుంటూ ఎదిగిన విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని హరీశ్ రావు తెలిపారు. గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన రూ.50 కోట్ల పీసీసీ పదవి ఆరోపణలను కూడా గుర్తు చేశారు. త్యాగాలు, నిజాయితీ పునాదులపై ఎదిగిన పార్టీ బీఆర్ఎస్ అని, ఎమ్మెల్యేలు, మంత్రులు పదవుల కోసం త్యాగాలు చేసిన చరిత్ర తమ పార్టీకే ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *