Jupally Krishna Rao

Jupally Krishna Rao: బీఆర్‌ఎస్‌కు కండలు కరిగిపోయి.. తోలు మాత్రమే మిగిలింది

Jupally Krishna Rao: తెలంగాణ రాజకీయాల్లో విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “రెండేళ్ల తర్వాత అధికారంలోకి రాగానే అందరి తోలు తీస్తా” అని కేసీఆర్ అంటున్నారని, కానీ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీకి కండలు కరిగిపోయి కేవలం తోలు మాత్రమే మిగిలిందని జూపల్లి ఎద్దేవా చేశారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే కేసీఆర్ ఇప్పుడు బయటకు వస్తున్నారని, ప్రజల సమస్యల కోసం కాదని ఆయన విమర్శించారు.

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మంత్రి జూపల్లి ఆరోపించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసిందని, కానీ పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయిందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో హడావుడిగా ఒక్క మోటార్ ఆన్ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం రాజకీయ గిమ్మిక్కేనని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా సుమారు 50 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

నీటి కేటాయింపుల విషయంలో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టిందని జూపల్లి విమర్శించారు. విభజన చట్టం ప్రకారం మనకు రావలసిన నీటి వాటాను కాపాడడంలో కేసీఆర్ విఫలమయ్యారని, ఏపీకి ఎక్కువ నీటిని వాడుకునే అవకాశం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తాగునీటి కోసమే కోర్టులో పిటిషన్లు వేసి కాలయాపన చేశారని, సాగునీటి పనులను నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.

ఇక రాజకీయ అంశాల గురించి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కలిసి పనిచేసినా ప్రజలు వాటిని తిరస్కరించారని జూపల్లి పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిసినా కనీసం మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని, కేసీఆర్ కుటుంబ సభ్యులు చేస్తున్న తప్పుడు ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *