Egg Price Hike: కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం అనూహ్యంగా 8 రూపాయలకు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక్కొక్క కోడిగుడ్డు ధర రూ.7.30 పలుకుతుండటం గమనార్హం. పౌల్ట్రీరంగ చరిత్రలోనే ఇదే రికార్డు ధర కావడం విశేషం. ఇంత వరకూ ఇంత ధరకు మునుపెన్నడూ అమ్మలేదని పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు తేల్చి చెప్తున్నారు.
Egg Price Hike: సామాన్యులు మాత్రం పెరిగిన గుడ్డు ధరతో బెంబేలెత్తిపోతున్నారు. గతంలో 30 కోడిగుడ్లకు రూ.160 నుంచి రూ.170 వరకు అమ్మకాలు అయ్యేది. గత 10 రోజులుగా అదే 30 కోడిగుడ్లకు హోల్‌సేల్ మార్కెట్‌లోనే రూ.210 నుంచి రూ.220 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. ఇదిలా ఉండగా నాటుకోడి గుడ్డు ధర రూ.15 వరకు విక్రయిస్తుండటం విశేషం. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేనందు వల్లే గుడ్డు ధర ఇంతలా పెరిగిందని పౌల్ట్రీ పరిశ్రమల యాజమాన్యాలు చెప్తున్నాయి.
తగ్గిన గుడ్ల ఉత్పత్తి
Egg Price Hike: ఒకప్పుడు రోజూ కనీసం 20 కోట్ల వరకు గుడ్లు కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉండేదని పౌల్ట్రీ పరిశ్రమల ప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పుడా పరిస్థితి లేదని ఒప్పుకుంటున్నారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నిత్యం దాదాపు 8 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరిగేది. ఇదే దశలో కోడిగుడ్ల ఉత్పత్తికి అయ్యే మక్కలు, చేపపొట్టు, ఇతర దాణా తదితరాల ధరలు పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాలను మూసివేశారు. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
