Krishna Chaitanya: హైడ్రా కమిషనర్ రంగనాథ్ వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆయన తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకున్నారు. ఇంట్లో ఒక్కసారిగా తూటా పేలిన శబ్దం వినిపించడంతో కంగారుగా గదిలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు, అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణ చైతన్యను చూసి నిర్ఘాంతపోయారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని చికిత్స నిమిత్తం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం అందుతోంది.
Also Read: Nara Lokesh: పనితీరు మార్చుకోకుంటే కౌన్సెలింగ్ తప్పదు.. ఎమ్మెల్యేలకు నారా లోకేశ్ హెచ్చరిక
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఈ ఆత్మహత్యాయత్నానికి వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ చైతన్య కొంతకాలంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడి, వాటిలో భారీగా డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తి, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఈ విపరీత నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

