Messi: భారత సాకర్ అభిమానులకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చిన లియోనెల్ మెస్సీ భారత పర్యటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పర్యటనకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చైనట్లు విచారణలో తేలినట్టు సమాచారం.
ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా, మెస్సీ భారత పర్యటన కోసం రూ.89 కోట్లు చెల్లించినట్లు దర్యాప్తు అధికారులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
విచారణలో భాగంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన ఘటనలపై దత్తా కీలక వివరాలు వెల్లడించాడు. మెస్సీ స్టేడియంలోకి వచ్చిన వెంటనే అనేక మంది అభిమానులు అతన్ని తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలకు పాల్పడటంతో మెస్సీ తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడని తెలిపారు. దీంతో షెడ్యూల్ కంటే ముందుగానే మెస్సీ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
జనసమూహాన్ని నియంత్రించేందుకు పదేపదే ప్రకటనలు చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని విచారణలో వెల్లడైంది. మైదానంలోకి ప్రవేశించేందుకు కేవలం 150 మందికే అనుమతి ఉండగా, దాదాపు మూడు రెట్లు ఎక్కువ మంది స్టేడియంలోకి ప్రవేశించినట్టు దత్తా తెలిపినట్టు సమాచారం.
అలాగే మెస్సీ పర్యటనకు సంబంధించిన ఖర్చుల వివరాలను కూడా ఆయన వెల్లడించాడు. మొత్తం రూ.100 కోట్లలో రూ.89 కోట్లు మెస్సీకి చెల్లించగా రూ.11 కోట్లు భారత ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినట్లు తెలిపాడు.
ఈ మొత్తంలో 30 శాతం స్పాన్సర్ల ద్వారా, మరో 30 శాతం టిక్కెట్ల విక్రయం ద్వారా సమకూరినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుండగా, మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

