KTR

KTR: వచ్చే రెండేళ్లు మనకు పరీక్షా కాలం.. బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

KTR: తెలంగాణ భవన్‌లో తాండూరు నియోజకవర్గానికి చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. “కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు” అంటూ సెటైర్లు వేశారు. రాబోయే రెండేళ్ల కాలం బీఆర్ఎస్ పార్టీకి ఒక పరీక్షా కాలమని, కార్యకర్తలు ఓపికతో ఉండాలని సూచించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఏమన్నా సరే, ప్రస్తుతానికి తలదించుకుని వెళ్లాలని, రెండు అడుగులు వెనక్కి వేయడంలో తప్పులేదని ఆయన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. సమయం వచ్చినప్పుడు మన సత్తా ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై హర్షం: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి రాకపోయినా, క్షేత్రస్థాయిలో గులాబీ సైనికులు అద్భుతంగా పోరాడారని కేటీఆర్ కొనియాడారు. ఈ ఫలితాలు చూసి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి వెనుకాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఫలితాల విషయంలో మీడియా ముందు పదే పదే మాట మారుస్తున్నారని విమర్శించారు. కారు గుర్తు లేకుండానే ఇంతటి విజయం సాధిస్తే, ఇక కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు.

సర్పంచుల బాధ్యత – నిధుల కేటాయింపు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు నేరుగా వస్తాయని, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వం అని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనడం హాస్యాస్పదమని, ఇళ్లు మరియు పెన్షన్ల లబ్ధిదారుల జాబితా గ్రామ పంచాయతీల్లోనే తయారవుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోని వర్గం ఏదీ లేదని, ప్రస్తుతం అందరూ బాధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గెలిచిన ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని, ఆ బాధ్యతలను నేతలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *