Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైకాపా నాయకులపై నిప్పులు చెరిగారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెరవలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రతిపక్ష నేతలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, అధికారంలో ఉన్నప్పుడే తాను ఎవరికీ భయపడలేదని, ఇప్పుడు అసలే భయపడబోనని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమరజీవి జలధార’ (వాటర్ గ్రిడ్) పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు 1.20 కోట్ల మందికి తాగునీరు అందించే ఈ ప్రాజెక్టును రూ. 7,910 కోట్లతో చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. 2027 నాటికి ఈ పనులన్నీ పూర్తి చేసి తీర ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు వంటి మహనీయుల స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
Also Read: Congress: సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై పీసీసీ సీరియస్.. 18 మంది ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్!
రాష్ట్రంలో రౌడీయిజం, కిరాయి గ్యాంగుల ఆగడాలు సాగనివ్వబోమని పవన్ హెచ్చరించారు. “మళ్లీ అధికారంలోకి వస్తే చంపేస్తాం, జైలుకు పంపుతాం” అని బెదిరిస్తున్న వైకాపా నాయకులకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. తప్పు చేస్తే ‘కీలుకు కీలు’ తీసేలా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాజకీయంగా ఒక్క నిర్ణయం తీసుకుంటే కిరాయి గ్యాంగులను అణచివేయడానికి తమకు రెండ్రోజులు చాలని పవన్ గంభీరంగా వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో తనపై వచ్చిన విమర్శలకు పవన్ ఈ వేదిక ద్వారా సమాధానం ఇచ్చారు. తాను సీట్లు అమ్ముకున్నానని కొందరు విమర్శించారని, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల ప్రయోజనాల కోసమే తాను సీట్లు తగ్గించుకుని కూటమిగా వెళ్లానని వివరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, గీత దాటి మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.
