Gold Price Today: పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు.. సామాన్యుల చూపు అటు పెళ్లి సందడిపై, ఇటు పసిడి ధరలపై ఉంటుంది. ప్రస్తుతం శుభకార్యాల సమయం కావడంతో చాలామంది నగలు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి, మళ్ళీ మరుసటి రోజుకే భారీగా పెరుగుతూ ఆభరణాల ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు తులం బంగారం డెబ్బై, ఎనబై వేల దగ్గర ఉంటేనే ఆశ్చర్యపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆ ధరలు ఏకంగా లక్ష రూపాయలను దాటి దూసుకుపోతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈరోజు మార్కెట్‌లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ. 1,34,170 పలుకుతుండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,22,990 వద్ద కొనసాగుతోంది. కేవలం కొన్ని నెలల క్రితం వరకు లక్షా 20 వేల లోపు ఉన్న ధర, ఇప్పుడు ఏకంగా లక్షా 35 వేల మార్కును తాకడం గమనార్హం. పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,34,170 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,22,900 వద్ద ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే చెన్నైలో ధరలు కొంత ఎక్కువగా ఉన్నాయి. అక్కడ తులం బంగారం (24 క్యారెట్లు) రూ. 1,35,050 కి చేరింది. మీరు గనుక నగలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రోజువారీ మార్పులను గమనిస్తూ ఉండటం చాలా ముఖ్యం.
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర దేశవ్యాప్తంగా సగటున రూ. 2,08,900 ఉండగా, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ఇది మరింత భారంగా మారింది. ఈ నగరాల్లో కిలో వెండి ఏకంగా రూ. 2,20,900 వద్ద ట్రేడవుతోంది. వెండి సామాన్లు లేదా వెండి కాయిన్స్ కొనాలనుకునే వారు ఈ భారీ పెరుగుదలను గమనించాల్సి ఉంటుంది. పెట్టుబడి దృష్ట్యా చూస్తే బంగారం లాభదాయకమే అయినా, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యులకు ఇది మోయలేని భారంగా మారుతోంది.
