Telangana: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలో కొందరు అభ్యర్థులు ఓట్ల కోసం విచ్చలవిడిగా డబ్బులు పంచారు. అయితే, ఆ డబ్బులు ఇప్పుడు సామాన్య ప్రజల పాలిట శాపంగా మారాయి. ఎందుకంటే, ఆ ఎన్నికల్లో పంచిన నోట్లన్నీ అసలైనవి కావు, నకిలీ నోట్లని తేలడంతో ఇప్పుడు ఆ ఊరి జనం లబోదిబోమంటున్నారు.
అసలు విషయం ఎప్పుడు బయటపడిందంటే.. జలాల్‌పూర్‌కు చెందిన చిన్న సాయిలు అనే రైతు తన వద్ద ఉన్న రూ. 2,08,500 నగదును క్రాప్ లోన్ చెల్లించడానికి కెనరా బ్యాంకుకు తీసుకెళ్లారు. ఆ డబ్బును పరీక్షించిన బ్యాంక్ అధికారులు షాక్‌కు గురయ్యారు. అందులో ఉన్న నోట్లన్నీ దొంగ నోట్లని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆ రైతు వద్ద ఉన్న రూ. 500 నోట్లలో దాదాపు 417 నోట్లు నకిలీవని పోలీసులు నిర్ధారించారు.
విచారణలో తేలిందేమిటంటే, సర్పంచ్ ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థి ఓటర్లను ఆకర్షించడానికి ఈ దొంగ నోట్లను పంచారు. సామాన్య ప్రజలు అవి నిజమైన నోట్లే అనుకుని దాచుకున్నారు. తీరా ఇప్పుడు బ్యాంకులకు వెళ్లి కడుతుంటే అవి నకిలీవని తేలడంతో ఓటర్లు తల పట్టుకుంటున్నారు. ఓటుకు నోటు తీసుకున్న పాపానికి, ఇప్పుడు ఉన్న డబ్బులు పోయి, కేసుల్లో ఇరుక్కుంటామేమోనని గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చ మొదలైంది. కేవలం గెలవడం కోసం కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ఆ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
