KTR: 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు సవాల్ విసిరారు. రాష్ట్రంలో 66 శాతం ప్రజలు కాంగ్రెస్‌తోనే ఉన్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. నిజంగా అంత మద్దతు ఉంటే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10 సీట్లు కూడా గెలవలేదని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ 80 గ్రామాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయని, ఎన్నికల సమయంలో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలోని 57 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌పై ఐక్యంగా పోరాడాలని, ఓటమి పాలైన అభ్యర్థులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆయనతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరామని చెప్పిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారని విమర్శించారు

కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వెంటే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా విజయం ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజల కోసమే పనిచేయాలని, గ్రామ పంచాయతీ నిధులను ఎవరు ఆపలేరని తేల్చి చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *