Nara Lokesh: రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. యూనివర్సిటీ గేటు వద్ద ఏర్పాటు చేసిన జనసేన ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో వివాదం మొదలైంది. తమ పార్టీ ఫ్లెక్సీలు తీసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనసైనికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ గొడవ మరింత పెరగడానికి ప్రధాన కారణం స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, మహిళా నేత వెంకటలక్ష్మి పట్ల జరిగిన వ్యవహారమే. కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమెను యూనివర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడున్న వారు ఆమెను నెట్టివేయడంతో జనసైనికులు, వీర మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. తమ ఎమ్మెల్యే కుటుంబానికే గౌరవం లేకపోతే ఎలాగని వారు నిలదీశారు.
మంత్రి కార్యక్రమం మొదలయ్యే కొద్దిసేపటి ముందే ఈ గొడవ జరగడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అయితే, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రంగంలోకి దిగి తన అనుచరులను, జనసైనికులను శాంతింపజేశారు. కూటమి ప్రభుత్వం సజావుగా సాగడం కోసం ఇలాంటి చిన్నపాటి అవమానాలను భరించేందుకు తాను సిద్ధమని ఆయన సర్దిచెప్పారు. మంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఆయన పెద్దమనసుతో వ్యవహరించారు.
ప్రస్తుతానికి పరిస్థితి సద్దుమణిగినప్పటికీ, యూనివర్సిటీ ఉద్యోగి ఒకరు ఈ ఘటనపై రాజానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన వివాదంపై తర్వాత మాట్లాడుకుందామని, ప్రస్తుతానికి కార్యక్రమం ముఖ్యం అని ఎమ్మెల్యే తన కార్యకర్తలకు సూచించారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
