DGP Shivadhar Reddy: ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత బోండీ బీచ్‌లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌తో సంబంధం ఉందన్న వార్తలు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. దీనిపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పందిస్తూ కీలక విషయాలను వెల్లడించారు. ఈ ఉగ్రదాడికి, హైదరాబాద్ నగరానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
సాజిద్ అక్రమ్ నేపథ్యం ఇదీ.. నిందితుడు సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌కు చెందినవాడన్న మాట వాస్తవమేనని డీజీపీ తెలిపారు. అయితే, అతను దాదాపు 25 ఏళ్ల క్రితమే నగరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 1998లో ఉపాధి వెతుక్కుంటూ ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్, అక్కడే స్థిరపడ్డాడు. అక్కడ ఒక యూరోపియన్ యువతిని వివాహం చేసుకున్నాడని, అప్పటి నుండి అతను ఆస్ట్రేలియాలోనే నివసిస్తున్నాడని పోలీసు విచారణలో తేలింది.
హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చాడంటే? సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత కేవలం ఆరు సార్లు మాత్రమే భారత్‌కు వచ్చాడని డీజీపీ వివరించారు. 1998లో తన భార్యతో కలిసి ఒకసారి, ఆ తర్వాత 2004, 2009లో వ్యక్తిగత పనులపై వచ్చాడు. 2011, 2016లో ఆస్తి గొడవలను పరిష్కరించుకోవడానికి నగరాన్ని సందర్శించాడు. చివరిగా 2022లో తన తల్లిని, సోదరిని చూడటం కోసం హైదరాబాద్‌కు వచ్చి వెళ్లాడని సమాచారం.
నగర ప్రజలు ఆందోళన చెందవద్దు బోండీ బీచ్ దాడిలో 16 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, అయితే ఈ ఘటన వెనుక ఉన్న కుట్రలకు హైదరాబాద్‌తో ఎలాంటి లింకులు లేవని డీజీపీ భరోసా ఇచ్చారు. అతను కేవలం ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి మాత్రమేనని, అతని నేరపూరిత ఆలోచనలకు లేదా ఉగ్రవాద చర్యలకు ఇక్కడి వ్యక్తులతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
