Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ బాధ్యతలు అప్పగించడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేశాభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్రను చంద్రబాబు ప్రత్యేకంగా కొనియాడారు. గత పదేళ్లలో మోదీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలు, అభివృద్ధి పథకాల వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ బ్రాండ్ విలువ పెరిగిందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ నేడు భారతదేశం వైపు చూస్తున్నాయని, దీనికి మోదీ దార్శనికతే కారణమని ఆయన పేర్కొన్నారు. సరైన సమయంలో దేశాన్ని నడిపించడానికి సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారని, మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా, సామాజికంగా అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోందని ముఖ్యమంత్రి వివరించారు.
Also Read: KomatiReddy rajgopal: త్వరలోనే నాకు మంత్రి పదవి లభిస్తుంది
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు ఈ పర్యటనలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ఆయన, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల గురించి చర్చలు జరిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశమయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశం, రాష్ట్రం సంయుక్తంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర-రాష్ట్రాల సమన్వయం అత్యంత అవసరమని చంద్రబాబు ఉద్ఘాటించారు.
