Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒమన్ పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పురస్కారమైన **‘ది ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఒమన్’**ను సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ గురువారం ప్రదానం చేశారు. ఈ పురస్కారం గతంలో క్వీన్ ఎలిజబెత్, నెల్సన్ మండేలా వంటి ప్రపంచ ప్రఖ్యాత నేతలకు మాత్రమే లభించడం విశేషం.
రెండు రోజుల క్రితమే ఇథియోపియా నుంచి అత్యున్నత గౌరవాన్ని అందుకున్న ప్రధాని మోదీకి ఇది 29వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషంగా నిలిచింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రతిష్ఠను మరింత పెంచిన ఘనతగా ఈ అవార్డును విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఈ సందర్భంగా మస్కట్‌లోని అల్ బరకా ప్యాలెస్‌లో ప్రధాని మోదీ, ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్‌ల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కుదరడాన్ని చారిత్రక మైలురాయిగా నేతలు పేర్కొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు
ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భారత్–ఒమన్ మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ‘మైత్రీ పర్వ్’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ఇండియా–ఒమన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొని, ఒమన్ వ్యాపారవేత్తలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.
