Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎంతమంది ఆనందంగా ఉంటున్నారో తెలియదు కానీ, పెళ్లి తర్వాత వేధింపుల తాకిడికి మరికొందరు బలవుతున్నారు. అత్తమామల వేధింపుల కారణంగా ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన హైదరాబాద్ శివార్లలోని తాండూరు పట్టణంలో కలకలం రేపింది.
అసలు ఏం జరిగింది? తాండూరుకు చెందిన నరేష్, అనూష కొంతకాలంగా గాఢంగా ప్రేమించుకున్నారు. కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్న ఈ జంట పెళ్లికి అనూష తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే, నరేష్ తల్లి మొదట ససేమిరా అన్నా.. కొడుకు కోరిక మేరకు చివరకు అయిష్టంగానే పెళ్లికి ఒప్పుకుంది. వీరి వివాహం జరిగి ఎనిమిది నెలలు గడుస్తోంది.
కొడుకు కోసం పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించిన అత్త, పెళ్లయిన కొద్దిరోజులకే తన అసలు రూపాన్ని బయటపెట్టింది. తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో కొడుకుని ఏమీ అనలేక, కోడలు అనూషను టార్గెట్ చేసింది. నిత్యం మాటల తూటాలతో, మానసిక హింసతో అనూషను వేధించేది. అత్త వేధింపులు భరించలేక అనూష తరచుగా పుట్టింటికి వెళ్లేది. ప్రతిసారీ భర్త నరేష్ వచ్చి, ఇకపై ఇలా జరగదని నమ్మబలికి ఆమెను తిరిగి అత్తారింటికి తీసుకువెళ్లేవాడు.
ఇది కూడా చదవండి: Adavi sesh: నాకు ఏ స్టార్ ట్యాగ్ వద్దు.. అమ్మానాన్న పెట్టిన పేరు చాలు
మూడు రోజుల క్రితం ఇంట్లో గొడవ జరగడంతో అనూష పుట్టింటికి వచ్చింది. ఎప్పటిలాగే నరేష్ వచ్చి సర్దిచెప్పి ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. అయితే, 2025 డిసెంబర్ 18వ తేదీ ఉదయం అనూష తన అత్తారింట్లో శవంగా పడి ఉండటం చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. సమాచారం అందుకున్న అనూష కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తమ బిడ్డను అత్తమామలే కొట్టి చంపారని అనూష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనూష అన్నయ్య మాట్లాడుతూ.. “నా చెల్లెలిని తరచుగా వేధించేవారు. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పంపించేవాళ్లమే కాదు” అని ఆవేదన వ్యక్తం చేశాడు. అనూష భర్త నరేష్‌తో పాటు అతని తల్లిదండ్రులను వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరపాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు: ఈ మరణం వెనుక అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భార్యను తల్లి వేధిస్తుంటే నరేష్ ఎందుకు అడ్డుకోలేదు? అనూష తన ఆవేదనను తల్లిదండ్రులకు చెప్పలేదా? లేక చెప్పినా వారు సర్దుకుపోమని నిర్లక్ష్యం చేశారా? ఇది ఆత్మహత్యనా లేక హత్యనా? తెలియాల్సి ఉంది.
