Sahana Sahana: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంక్రాంతి పూనకాలు మొదలయ్యాయి. మారుతి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) నుంచి తాజాగా విడుదలైన మెలోడీ సాంగ్ ‘సహనా సహనా’ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
విజువల్ ఫీస్ట్‌గా ‘సహనా సహనా’..
ఇటీవల విడుదలైన ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ఈ పాట, ఫుల్ వెర్షన్‌లో శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్‌తో ప్రభాస్ జోడీ స్క్రీన్ మీద చాలా కలర్‌ఫుల్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కుదిరిన రొమాంటిక్ కెమిస్ట్రీ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్టార్ కంపోజర్ తమన్ అందించిన మ్యూజిక్ మరోసారి తన మార్క్ చాటుకోగా, విశాల్ మిశ్రా తన గాత్రంతో ప్రాణం పోశారు. కృష్ణకాంత్ అందించిన సాహిత్యం మనసును హత్తుకునేలా ఉంది.
సంక్రాంతి బరిలో రొమాంటిక్ హారర్!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక రొమాంటిక్ కామెడీ హారర్ జోనర్‌లో రాబోతోంది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్‌తో పాటు మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కూడా సందడి చేయనున్నారు.
2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
