KP Vivekanand Goud: తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఉదంతం కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఐదుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, స్పీకర్ తీర్పుపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన ఫిర్యాదులను పరిశీలించిన స్పీకర్, అందులో తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. సదరు ఎమ్మెల్యేలు అధికారికంగా పార్టీ మారినట్లు నిరూపించే బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో, వారు శాసనసభ్యులుగా కొనసాగుతారని తీర్పునిచ్చారు. ఈ నిర్ణయంతో సదరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
వ్యవస్థలపై నమ్మకం పోతోంది: ఎమ్మెల్యే వివేకానంద ఆగ్రహం
స్పీకర్ నిర్ణయం వెలువడిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తన విధులను నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Maoist Party: నిరాయుధుల అరెస్టు అప్రజాస్వామికం.. మావోయిస్టు పార్టీ కీలక లేఖ
వివేకానంద లేవనెత్తిన ప్రధానాంశాలు:
తీర్పు కాపీ ఇవ్వాలని కోరితే, కేవలం ఒకే ఒక్క పేరా ఉన్న కాగితాన్ని చేతిలో పెట్టారని వివేకానంద విమర్శించారు. ఆర్డర్ కాపీని పూర్తిస్థాయిలో చదివి వినిపించాలనే నిబంధన ఉన్నా, స్పీకర్ దానిని పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాల వల్ల రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తదుపరి అడుగు.. న్యాయపోరాటం!
స్పీకర్ తీర్పు ఏకపక్షంగా ఉందన్న బీఆర్ఎస్, దీనిపై ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రాజకీయ నైతికతను పక్కన పెట్టి ఇచ్చిన ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వివేకానంద ప్రకటించారు. ఈ పరిణామంతో తెలంగాణలో ఫిరాయింపుల రగడ అసెంబ్లీ నుంచి కోర్టు మెట్ల వరకు వెళ్లేలా కనిపిస్తోంది.
