KTR

KTR: ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు

KTR: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారం మత్తులో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని, అవి ప్రజల సొమ్మని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు నిర్వహించిన అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను, ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి నిధులు కాంగ్రెస్ నేతల జాగీరు కాదని, లబ్ధిదారుల ఎంపిక గ్రామసభలు, సర్పంచుల ద్వారానే జరగాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొందరు ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని, మరికొందరు బహిరంగంగా నిధులు కోరుతూ వేడుకుంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలకే నిధులు లేని పరిస్థితిలో గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశంలోనూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ.3,500 కోట్లు పొందేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి బీసీలను మోసం చేశారని అన్నారు. చట్టం ప్రకారం ఈ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే చెందాలని, దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు.

రైతుల పరిస్థితిపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్ పాలనలో రైతుబంధు, ఎరువులు ఇంటి వద్దకే వచ్చేవని గుర్తు చేశారు. ప్రస్తుతం బస్తా యూరియా కోసం రైతులు రోడ్లపై కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కొరతను దాచేందుకే ప్రభుత్వం ‘యూరియా యాప్’ అనే డ్రామాకు తెరలేపిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు నుంచి రెండున్నరేళ్లలో కూలిపోవడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. సర్పంచులు తమ పదవీకాలంలోని చివరి రెండేళ్లు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *