Rammohan Naidu: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా సాగుతున్నాయని, విమానాశ్రయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరో నెలలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అన్ని పనులు ప్రణాళిక ప్రకారమే పూర్తవుతున్నాయని చెప్పారు.
విశాఖపట్నంలో జరిగిన జీఎంఆర్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ప్రాజెక్టు ఒప్పంద కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సమక్షంలో రామ్మోహన్ నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో జరిగింది. ఈ సందర్భంగా జీఎంఆర్–మాన్సాస్ సంస్థల మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించాలని మొదట భావించినప్పటికీ, ఒక నెల ముందుగానే అంటే మే నెలలోనే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. మరో ఆరు నెలల్లో విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
Also Read: Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 16 మంది మావోయిస్టుల అరెస్ట్
భోగాపురం విమానాశ్రయానికి సమీపంలోని విజయనగరం–విశాఖపట్నం సరిహద్దు ప్రాంతాన్ని ప్రభుత్వం తొలి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికే జీఎంఆర్–మాన్సాస్ ఎడ్యు సిటీ ప్రాజెక్ట్ అనే పేరు పెట్టారు.
ఈ ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీకి 136 ఎకరాల భూమిని కేటాయించారు. గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, జీఎంఆర్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. కోట్ల విలువైన భూమిని విద్య కోసం అందజేయడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఎడ్యుకేషన్ సిటీ ద్వారా ఏవియేషన్ రంగానికి అవసరమైన శిక్షణ సంస్థలు, విద్యాలయాలు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. విమానయాన రంగంలో శిక్షణ సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ఆ లోటును ఈ ప్రాజెక్టు భర్తీ చేస్తుందని తెలిపారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవియేషన్ విశ్వవిద్యాలయాలకు కూడా ఇది కేంద్రంగా మారుతుందని అన్నారు.
Also Read: Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
ఉత్తరాంధ్ర ప్రాంతం ఒకప్పుడు వలసల ప్రాంతంగా ఉండేదని, కానీ గత కొన్నేళ్లుగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం, మౌలిక వసతులు, ఏవియేషన్ రంగాలపై స్పష్టమైన అవగాహనతో భవిష్యత్ తరాల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి మారి, ప్రపంచం ఈ ప్రాంతానికి వచ్చేలా అభివృద్ధి జరుగుతోందన్నారు.
దేశంలో పౌర విమానయాన రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏవియేషన్ రంగం ప్రతి ఏడాది సుమారు 12 శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్తోందన్నారు. సాధారణ ప్రజలు కూడా విమాన ప్రయాణం చేసే స్థాయికి దేశం చేరుకుందని చెప్పారు. భవిష్యత్‌లో దేశంలో విమానాల సంఖ్య ఎనిమిది వేలకు చేరే అవకాశముందని అంచనా వేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ రెండూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఇవి యువతకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టడంతో పాటు, రాష్ట్రాన్ని ఏవియేషన్ రంగంలో ముందంజలో నిలిపేలా చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
