KTR: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో జరిగిన సోమార్‌పేట ఘటనపై తీవ్రంగా స్పందించారు. బీఆర్‌ఎస్ తరఫున సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన బాలరాజు కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడడాన్ని ఆయన ఖండించారు. ఈ దాడిని ఆయన హత్యాయత్నంగా అభివర్ణించారు.
సోమవారం రోజు ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేటలో ఈ ఘటన జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో బాలరాజు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత కాంగ్రెస్ నేతలు బాలరాజు ఇంటి వద్దకు వచ్చి, ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను ట్రాక్టర్‌తో ఢీకొట్టే ప్రయత్నం చేశారని కేటీఆర్ తెలిపారు. ఈ దాడి ఘటనపై కామారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడినా కూడా పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ పోలీసులకు గట్టి హెచ్చరిక చేశారు. పోలీసుల జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తున్నాయని, కాంగ్రెస్ నాయకులు ఇవ్వడం లేదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. పోలీసుల తీరు మారకపోతే బీఆర్‌ఎస్ శ్రేణులు తిరగబడటం ఖాయమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై తక్షణమే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని కేటీఆర్ సూచించారు.
