Mumbai: ట్వింగం నములుతూ మెస్సీతో సెల్ఫీ.. ట్రోల్స్ కి గురవుతున్న సీఎం భార్య

Mumbai: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత ఫడ్నవిస్, మెస్సీతో సెల్ఫీ దిగిన తీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ప్రవర్తన అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన మెస్సీ, ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ మహాదేవ’ ఫుట్‌బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని మెస్సీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నవిస్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఆమె పదేపదే మెస్సీతో సెల్ఫీల కోసం ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫొటోలకు పోజులివ్వడం వంటి దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. అంతేకాదు, మెస్సీ పక్కన నిలబడేందుకు ఫుట్‌బాలర్ రోడ్రిగో డి పాల్‌ను పక్కకు జరగమని కోరినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇలా ప్రవర్తించడం తగదని, అధికార హోదా ఉన్నవారు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందిగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఆమెకు మైదానంలో అంతగా జోక్యం చేసుకునే అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు

అనంతరం అమృత ఫడ్నవిస్ మెస్సీతో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, అక్కడ కూడా వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో నిర్వహణ లోపాలపై విమర్శలు రావగా, హైదరాబాద్‌లో ఏర్పాట్లు మాత్రం ప్రశంసలు అందుకున్నాయి. ముంబైలో చోటుచేసుకున్న ఈ తాజా ఘటనతో మెస్సీ పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *