Revanth Reddy: రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని, దీనిని కాపాడుకునే బాధ్యత దేశ ప్రజలందరిపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పారు. ‘ఓట్ చోర్-గద్దీ ఛోడ్’ అనే పేరుతో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పెద్ద ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాజ్యాంగం రాసే సమయంలో మహాత్మా గాంధీ, అంబేడ్కర్, రాజ్యాంగ సభ సభ్యులు దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు ఇవ్వడం గురించి చర్చిస్తుండగా, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎం.ఎస్. గోల్వాల్కర్ వంటి వారు వారికి ఓటు హక్కు ఇవ్వొద్దని అన్నారని గుర్తు చేశారు. కానీ గాంధీ, అంబేడ్కర్ చొరవతో వారికి ఓటు హక్కు దొరికింది కాబట్టే, ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటులో వారు కూడా భాగం అవుతున్నారని తెలిపారు.
ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ ఆలోచనలతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక, తమ భావజాలాన్ని అమలు చేయడానికి 400 సీట్లు కావాలని కోరారని ఆయన అన్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లను తీసేస్తారని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు.
ప్రజలు అలా చేయబట్టే ఇవాళ రాజ్యాంగం, రిజర్వేషన్లు ఇంకా నిలిచి ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ (SIR) పేరుతో కొత్త ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీల కోసం గాంధీ, అంబేడ్కర్ నిలబడినట్లే.. ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిలబడుతున్నారని, మనం వారికి అండగా ఉండాలని కోరారు.
ఎస్ఐఆర్ పేరుతో మొదట ఓటరు కార్డును తీసేస్తారని, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులను రద్దు చేస్తారని, ఆఖరికి ప్రజలకు ఉన్న అన్ని హక్కులను లాక్కుంటారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమస్య కేవలం ఎన్నికల సమస్య లేదా కాంగ్రెస్ పార్టీ సమస్య మాత్రమే కాదని, ఇది దేశం సమస్య అని అన్నారు. ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి నడవడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెబుతూ, దేశ ప్రజలంతా కలిసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
